‘మీరు చేయకుంటే మేము చేస్తాం’ .. కేంద్రంపై సుప్రీంకోర్టు ఫైర్

-

భారత తీరగస్తీ దళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో అలసత్వం ప్రదర్శిస్తున్న కేంద్రంపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా చర్యలు తీసుకోకుంటే తామే ఒక అడుగు ముందుకువేయాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది .

అర్హులైన షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారిణులతో శాశ్వత కమిషన్‌ ఏర్పాటుచేయాలని కోరుతూ ఇండియన్‌ కోస్ట్‌ గార్డుకు చెందిన ఓ అధికారిణి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి.. ఆర్మీ, నేవీతో పోలిస్తే కోస్ట్‌ గార్డులో పనితీరు కొంచెం భిన్నంగా ఉంటుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

మహిళలను మినహాయించేందుకు అవి కారణాలు కాదని పేర్కొంటూ ఏజీ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. మహిళలను వేరుగా చూడలేమని.. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తామే జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ స్పందనను అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాలని పేర్కొంటూ తదుపరి విచారణ మార్చి 1కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version