మోదీని మరోసారి ఎందుకు గెలిపించాలో కిషన్‌రెడ్డి చెప్పాలి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మద్దతు ధర అడుగుతున్న రైతులను చంపుతున్నందుకు మళ్లీ గెలిపించాలా? అని నిలదీశారు. వరదలు వచ్చి హైదరాబాద్ నష్టపోతే కిషన్‌రెడ్డి ఏమైనా కేంద్ర నిధులు తెచ్చారా? అని అడిగారు. గత పదేళ్లలో కేసీఆర్, మోదీ కలిసి తెలంగాణకు చేసిందేమీ లేదని అన్నారు. 75 రోజులుగా రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దటం గురించే ఆలోచిస్తున్నామని తెలిపారు.
“ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్మించాలని యోచిస్తున్నాం. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర బాగు కోసం ఎవరు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తాం. నిస్సహాయులు ఎవరనేది నిర్ణయించడానికి ఏదైనా కొలమానం అవసరం. ఏ కొలమానం లేకుండా పథకం వర్తింపచేస్తే.. నిధులు దుర్వినియోగం అవుతాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైవేలకు కూడా రైతుబంధు నిధులు వెళ్లాయి. సంక్షేమ పథకాలు పేదలకు మాత్రమే వర్తించాలని రేషన్‌కార్డ్ నిబంధన పెడుతున్నాం. లబ్ధిదారుల గుర్తింపు నిరంతరం కొనసాగుతుంది.” అని సీఎం రేవంత్ తెలిపారు.