ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారాన్ని జులై 14వ తేదీన తెరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ రత్న భాండాగారం దిగువన రహస్య గది ఉందని చరిత్రకారులు అంటున్నారు. సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని చెబుతున్నారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమైనట్లు తెలిపారు.
రత్న భాండాగారం తెరిచి, సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన బీజేపీ ప్రభుత్వం.. సొరంగ మార్గం, రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ‘పూరీ రాజు కపిలేంద్రదేవ్ తూర్పు, దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తమునికి సమర్పించినట్లు చరిత్రలో ఉందని ప్రముఖ చరిత్రకారుడు నరేంద్రకుమార్ మిశ్ర తెలిపారు. తర్వాత పురుషోత్తందేవ్ హయాంలోనూ స్వామివారికి సంపద సమకూరిందని.. అప్పట్లో శ్రీక్షేత్ర భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపర్చడానికి రహస్య గది నిర్మించారని పేర్కొన్నారు. శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలున్నా, వాటిని ఎవరూ కనుగొనలేకపోయారని దాస్ వివరించారు.