శిల్పాశెట్టి భర్త అరెస్టు.. అశ్లీలతపై చట్టం ఏం చెబుతోంది?

అశ్లీల చిత్రాల చిత్రీకరణ, యాప్‌లకు వీడియో క్లిప్పుల విక్రయం కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టు ‘చట్టాల’పై చర్చకు దారి తీసింది. దేశంలో ‘పొర్నోగ్రఫిక్’ కంటెంట్‌పై ఉన్న చట్టాలు ఏమిటి? దేనికి అనుమతి ఉంది? ఏదీ నేరం? ఏదీ కాదు? రాజ్‌కుంద్రా ఏయే సెక్షన్ల కింద కేసులు మోపారు. ఎలా నేరస్తుడు అవుతాడు.

దేశంలో పోర్నోగ్రాఫిక్ కంటెంట్‌పై 1860లో ప్రవేశపెట్టిన ఇండియన్ పినల్ కోడ్(ఐపీసీ)లోని సెక్షన్లు 292, 293, 294 ప్రకారం చర్యలు చేపడుతారు. 2000లో ప్రవేశపెట్టిన ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 67ఏ ప్రకారం కూడా చర్యలు తీసుకోవచ్చు.

భారతీయ చట్టాల ప్రకారం అశ్లీల విషయాలను చూడటం లేదా చదవటం నేరం కాదు. కానీ, అశ్లీల చిత్రాల చిత్రీకరణ, ప్రచారం, పంపిణీకి సంబంధించిన చర్యలు చట్టరీత్యా నేరం. శిక్షార్హమైనవి కూడా.

ఐపీసీలో ఏముంది?

సెక్షన్ 292 అశ్లీలత అంటే ఏమిటో వివరిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం అశ్లీల చిత్రాల చిత్రీకరణ, పంపిణీకు మొదటిసారి పాల్పడితే మూడేండ్ల జైలు శిక్ష రెండోసారి పాల్పడితే ఐదేండ్ల జైలు శిక్ష విధించవచ్చు.

ఐపీసీ సెక్షన్ 293.. 20ఏండ్ల లోపు యువతకు పోర్నొగ్రఫిక్ కంటెంట్ పంపిణీ చేయడం, విక్రయించడం లేదా చిత్రీకరించడం గురించి వివరిస్తుంది.

సెక్షన్ 294 ప్రకారం నటన లేదా పాటల రూపంలో బహిరంగ ప్రదేశాలు లేదా జనబాహుళ్య ప్రదేశాల్లో ప్రదర్శించడం నేరం.

రాజ్‌కుంద్రాపై మోపిన అభియోగాలు పై మూడు సెక్షన్ల కిందికి వస్తాయి.

మహిళలు, పిల్లలు ఉంటే..

– మహిళలు, పిల్లలను భాగస్వామ్యులను చేస్తే ఇతర చట్టాల ప్రకారం శిక్షకు అర్హులవుతారు.

– ఒకవేళ పిల్లలు ఉంటే.. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెస్(పోస్కో) యాక్ట్, 2012 ప్రకారం చర్యలు చేపడుతారు. పోస్కో యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం పోర్నోగ్రఫీ కోసం పిల్లలను ఎలాంటి మీడియాలో వినియోగించినా నేరం.

– మహిళలు బాధితులైతే ఇన్‌డిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ (ప్రొహిబిషన్) యాక్ట్ మహిళలను అసభ్యకరంగా చూపడం లేదా ప్రచురించడం లేదా ప్రచారం చేయడం నేరం .

ఇన్‌డిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ (ప్రొహిబిషన్) సెక్షన్స్ 3, 4, 6, 7 ప్రకారం రాజ్ కుంద్రా కేసులను ఎదుర్కోనున్నారు. ముంబయి అశ్లీల వీడియో రాకెట్ కేసులో రెండు కంపెనీలల్లో రాజ్ కుంద్రా లింకులను పోలీసులు కనుగొన్నారు.

ఐటీ చట్టం..

ఐటీ చట్టం, 2000 సెక్షన్ 67ఏ ప్రకారం లైంగిక అసభ్యత చర్యలకు సంబంధించిన మెటీరియల్‌ను ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ప్రదర్శించడం లేదా పంపిణీ చేయడం లేదా ప్రసారం చేయడం నేరం. ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు.

ఇది ఐపీసీ సెక్షన్ 292కు దగ్గరగా ఉంటుంది. ఐటీ చట్టం సెక్షన్ 67ఏ ప్రకారం పోర్నోగ్రఫిక్ కంటెంట్‌ను చిత్రీకరించినా లేదా పంపిణీ చేసినా ఐదేండ్ల జైలుతోపాటు రూ.10లక్షల వరకు జరిమానా విధించవచ్చు.