కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 స్థానాలు గెలుచుకుని విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ ను అంతర్గత సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఇవాళ్టి వరకు సీఎం సీటు గురించి తలలు పట్టుకున్న హస్తం పార్టీ.. సమస్యను ఎట్టకేలకు ఓ కొలిక్కి తీసుకొచ్చింది. అనుభవజ్ఞుడైన సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ఏకైక ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ తరుణంలోనే…. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం బెంగళూరు కంటిరవ మైదానంలో భారీ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుండగా…10 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ కార్యక్రమానికి మల్లికార్జున్ కర్గే, సోనియా, రాహుల్ తో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా హాజరుకానున్నట్లు సమాచారం.