ప్రధానమంత్రి మోదీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమేనంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ స్పందనపై బీజేపీ నేత స్మృతి ఇరానీ స్పందించారు. మోదీ లాంటి వ్యక్తితో చర్చించే స్థాయి ఉందా? అని రాహుల్పై ధ్వజమెత్తారు. ఏ హోదాలో చర్చకు వస్తారని ప్రశ్నించారు.
బీజేపీ సాధారణ కార్యకర్తతో కంచుకోటలోనే పోటీ పడలేని వ్యక్తి గొప్పలకు పోవడం ఆపాలని స్మృతి రాహుల్కు చురకలంటించారు. మోదీతో చర్చించేందుకు ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థా?’’ అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో బహిరంగ చర్చ నిర్వహించాలన్న విశ్రాంత న్యాయమూర్తుల చొరవను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆ చర్చకు తాను కానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానీ వచ్చేందుకు సిద్ధమేనని శనివారం వెల్లడించారు. దీంట్లో మోదీ కూడా భాగస్వాములవుతారని ఆశిస్తున్నానంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే రాహుల్ ట్వీట్పై స్మృతి ఇరానీ స్పందించారు.