కోటి ఇళ్లకు సౌర విద్యుత్తు.. ‘ప్రధాన మంత్రి సూర్యోదయ్‌ యోజన’ పథకం ప్రకటించిన మోదీ

-

భారత్లోని కోటి గృహాలకు సౌర విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించారు. ఇందుకోసం మరో సరికొత్త పథకాన్ని ప్రకటించారు. ‘ప్రధాన మంత్రి సూర్యోదయ్‌ యోజన’ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మోదీ తెలిపారు. అయోధ్యలో సోమవారం శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని దిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఇళ్ల కప్పులపై సౌర ఫలకాల (సోలార్‌ రూఫ్‌టాప్‌) వ్యవస్థను నెలకొల్పి సౌర విద్యుత్ అందించనున్నట్లు పేర్కొన్నారు. సౌర శక్తిని వినియోగించుకోవడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్తు బిల్లులు తగ్గడమే కాకుండా ఇంధన రంగంలో మన దేశం స్వావలంబన దిశగా ముందడుగు వేస్తుందని వివరించారు.

సూర్యవంశ భగవాన్‌ శ్రీరాముని కాంతి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎల్లప్పుడూ శక్తి పొందుతుంటారని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన శుభ సందర్భంగా దేశంలోని ప్రజలంతా వారి ఇళ్ల కప్పులపై సొంత సౌర ఫలకాల వ్యవస్థ కలిగి ఉండాలనే తన సంకల్పం మరింత బలపడిందని చెప్పారు. అందుకే దిల్లీ చేరుకున్న వెంటనే దీనిపైనే తొలి నిర్ణయం తీసుకున్నానని సోషల్ మీడియా ‘ఎక్స్‌’లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news