World Cup 2023 : ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్ అయినట్లే కనిపిస్తోంది. వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్తాన్ కు మరో ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ పోరులో చిత్తై టోర్నీలో వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రపంచకప్ లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఒక వికెట్ తేడాతో పాకిస్తాన్ ఓడిపోయింది. 271 పరుగుల లక్ష్యాన్ని 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
దక్షిణాఫ్రికా ఐడెన్ మార్కరమ్ (91) అదరగొట్టడంతో ఓ దశలో దక్షిణాఫ్రికా సులువుగా గెలిచేలా కనిపించింది. అయితే… ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి టెన్షన్ లో పడింది. చివర్లో కేశవ్ మహారాజ్ (7నాటౌట్) విలువైన పరుగులు చేసి సఫారీ జట్టును గెలిపించాడు. దీంతో ఒక వికెట్ తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడం పాకిస్తాన్కు ఇదే తొలిసారి. ఈ ప్రపంచకప్ లో తొలి రెండు మ్యాచ్లు గెలిచిన పాక్…వరుసగా నాలుగు మ్యాచుల్లో పరాజయం చెందింది.