భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఈరోజు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులతో పాటు సామాన్యులు కూడా ప్రత్యేక అతిథులుగా హాజరుకాబోతున్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంత మందిని ముఖ్యఅతిథులుగా ఆహ్వానించారు. ఈ జాబితాలో పలువురు ట్రాన్స్‌జెండర్లు, నూతన పార్లమెంటు భవన నిర్మాణ శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ రైళ్ల వంటి కీలక ప్రాజెక్టుల్లో పని చేసిన వారికి అవకాశం కల్పించారు. దేశాభివృద్ధికి తోడ్పడుతున్న వీరందరినీ మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
మరోవైపు ప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు, భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టాబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్, సీషెల్స్ అధ్యక్షుడు వావెల్ రామ్‌కలావాన్ తదితరులకు ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ఆదివారం నుంచి మూడు రోజుల భారత్ పర్యటనకు వస్తున్నారు. ఆయన 9న జరిగే మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. మంగళవారం ఆయన తిరిగి నేపాల్‌కు బయలుదేరతారు.