భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను తాము ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ స్పష్టం చేశారు. పొరుగు దేశంగా అది తమ బాధ్యత అని తెలిపారు. భారత భద్రతా ప్రయోజనాలను పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. శ్రీలంక తీరాలకు చైనా పరిశోధక నౌక చేరడంపై భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలపైనా సబ్రీ స్పందించారు.
ఈ సందర్భంగా సబ్రీ మాట్లాడుతూ.. తాము ఇతర దేశాలతో చాలా పారదర్శకంగా పనిచేస్తామని.. పొరుగు వారికి నష్టం కలిగించే చర్యలకు ఏమాత్రం ఆమోదం తెలపబోమని వెల్లడించారు. భారత్ ఇతర దేశాలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగానే.. తమ విధానం కూడా ఉంటుంది కానీ, ఇతరులకు హాని తలపెట్టే నిర్ణయాలను మాత్రం తీసుకోబోమని పేర్కొన్నారు.
భారత్‌లోఎన్నికలు ప్రజాస్వామ్య వేడుక. వాటి ఫలితాలపై స్పందించబోం. భారత ప్రజలు తెలివైనవారు ఎవరిని ఎన్నుకోవాలో వారికి తెలుసు. అంతర్గత అంశమైన ఎన్నికలపై అంతకు మించి మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా భారత్‌తో మా బంధం కొనసాగుతుంది. అని అలీ సబ్రీ స్పష్టం చేశారు.