జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపుర్ ఇప్పటికీ అట్టుడికుతోంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లిన విషయం తెలిసిందే. మణిపుర్‌లో బాధితుల పునరావాసాన్ని పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టు.. మాజీ న్యాయమూర్తి గీతల్ మిట్టల్ నేతృత్వంలోని కమిటీ నియమించింది. ఈ కమిటీ ఇవాళ.. సుప్రీంకోర్టుకు మూడు నివేదికలను సమర్పించింది.
ఈ నివేదికలో హింస వల్ల నలిగిపోతున్న ప్రజలకు పరిహారం ఇచ్చే పథకాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని కమిటీ.. సుప్రీం కోర్టుకు తెలిపింది. అయితే ముగ్గురు సభ్యుల ప్యానెల్ పని తీరును సులభతరం చేసేందుకు శుక్రవారం రోజున ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం.. ఈ మూడు నివేదిక కాపీలను సంబంధిత న్యాయవాదులందరికీ అందజేయాలని సూచించింది. మణిపుర్ బాధితుల్లో ఒకరి తరఫు న్యాయవాది బృందా గ్రోవర్‌ను ప్యానెల్‌కు సంబంధించిన సూచనలను క్రోడీకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.