పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్తేనే కుర్ర కారు హుషారుతో చిందులు వేస్తారు. మా దేవుడు అని కొందరు మా అన్నా అని కొందరు చెప్తూ ఉంటారు. సినిమాలలో, రాజకీయ రంగంలో చిరంజీవి తమ్ముడు గా కన్నా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. సినీ రాజకీయ రంగాలలో తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నారు. సినీ రంగంలో ఖాళీ లేని సమయంలోనే చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా కొనసాగారు. తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో పవన్ రాజకీయాలను వదిలి సినిమాలపై దృష్టి సారించారు.
సమ సమాజ స్థాపన కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం 2014లో జనసేన పార్టీని స్థాపించారు. తనకంటూ సొంత మేనిఫెస్టోతో పార్టీని స్థాపించిన 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టకుండా ఉన్నారు. పరోక్షంగా టిడిపికి మద్దతు ఇచ్చారు. కానీ 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగి..కమ్యూనిస్టులతో పొత్తుతో పోటీ చేశారు. పవన్ రెండు స్థానాలలో పోటీ చేసి ఓడిపోయారు.
గాజువాకలో తిప్పల నాగిరెడ్డి, భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ పై తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. 2019 ఎన్నికల తర్వాత వైసిపి అధికారాన్ని చేపట్టిన తర్వాత పవన్ ప్రజలకు మరింత చేరువగా ఉంటున్నారు. ప్రతిపక్ష నేతగా పాలకపక్షం తప్పులను ఎత్తిచూపే క్రమంలో ప్రజాభిమానాన్ని చోరగున్నారు. ప్రత్యేక వాహనంపై మొదలుపెట్టిన వారాహి యాత్ర విజయవంతమై ప్రజలు పవన్ కు నీరాజనం పట్టారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టిడిపి జనసేన మధ్య పొత్తు ఉంటుంది అని అనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఈసారి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అని అభిమానులు, రాజకీయ నాయకులు, ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం లేదా భీమవరం నియోజకవర్గం లో పోటీ చేస్తారు అని ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో వాటికి స్వస్తి చెబుతూ పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని జనసేన వర్గాల నుంచి సమాచారం తెలిసింది.
2019లో కన్నా ఇప్పుడు జనసేన పార్టీ ప్రజలలో బలపడింది అని చెప్పటంలో అతిశయక్తి లేదు. భీమవరంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అనే సెంటిమెంటు ఉంది. కాబట్టి పవన్ భీమవరం నుంచి పోటీ చేసి ఆ సీటును కైవసం చేసుకుని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాలని కోరుకుంటున్నారు. ఎన్నికలు జరిగితే వైసిపి కోల్పోయే మొదటి నియోజకవర్గం భీమవరమే అని జనసేన శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి.