ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్తా పత్రికల్లో ఇచ్చిన క్షమాపణ ప్రకటన సైజు పతంజలి ఉత్పత్తుల పూర్తి పేజీ ప్రకటన మాదిరిగానే ఉందా అని ప్రశ్నించింది. పతంజలి ఆయుర్వేద్, వార్తా పత్రికల్లో క్షమాపణలు ప్రచురించామని యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. కోర్టు పట్ల తమకు అత్యంత గౌరవం ఉందని, ఇక నుంచి తప్పులు పునరావృతం కాబోవని చెప్పారు.
67 వార్తా పత్రికల్లో 10 లక్షల రూపాయల ఖర్చుతో ఈ ప్రకటనలు ఇచ్చినట్లు పతంజలి తరఫు న్యాయవాదులు సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. వార్తాపత్రికల్లో ప్రచురితమైన క్షమాపణలను 2 రోజుల్లోగా రికార్డు చేయాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం పతంజలి సంస్థ తరఫున న్యాయవాదుల్ని ఆదేశించింది. ఈ క్రమంలో ధర్మాసనం కొంత అసహనం వ్యక్తం చేస్తూ.. మీ ఉత్పత్తులకు సంబంధించి ఇచ్చే ఫుల్ పేజీ అడ్వర్టైజ్‌మెంట్‌ల సైజులోనే.. క్షమాపణల ప్రకటన ఉందా అని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన సుప్రీం, క్షమాపణల ప్రకటన సోమవారం ఎందుకు దాఖలు చేశారని, ఇంతకు ముందే చేయాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడింది. అనంతరం ఈ కేసును ఏప్రిల్ 30 కి వాయిదా వేసింది.