బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఐక్యమై కాసానిని గెలిపించాలని కోరారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. రైతు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసి మరోసారి మోసగించేందుకు వస్తున్నారని దుయ్యబట్టారు.
‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్ -1. పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్ -2. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని మరోసారి మోసానికి యత్నం. ప్రజలు ఒకసారి మోసపోతే నాయకులది తప్పు అవుతుంది. రెండోసారి మోసపోతే ప్రజలది తప్పు అవుతుంది. ప్రజలు మరోసారి మోసపోవద్దని కోరుతున్నాను. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలి. భాజపాను ఎదుర్కొనే శక్తి భారాసకు మాత్రమే ఉంది. బలహీనవర్గాలకు బలమైన గొంతుక కాసానిని గెలిపించాలి.’ అని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.