తమిళనాడు గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. స్టాలిన్ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక తీర్పునిచ్చింది. గవర్నర్లు అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని వ్యాఖ్యానించింది. రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లులను రిజర్వ్ చేయడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని తెలిపింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు ఎటువంటి విచక్షణాధికారాలు లేవు. బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో ఉంచకూడదు. రాష్ట్ర ప్రభుత్వ సలహాకు విరుద్ధంగా బిల్లును రాష్ట్రపతికి సిఫారసు చేయకపోతే గరిష్టంగా మూడు నెలల వ్యవధిలోనే గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి. అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ JB పార్దివాలా, జస్టిస్ R మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇక సుప్రీంకోర్టు తీర్పునివ్వడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పును చారిత్రాత్మకమైనది అభివర్ణించారు. ఎట్టకేలకు 10 బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించినట్లు భావిస్తున్నట్లు స్టాలిన్ పేర్కొన్నారు.