దిల్లీలో పాలనా వ్యవహారాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎల్జీకి షాక్ ఇస్తూ దిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. పాలన వ్యవహారాలపై నియంత్రణ అధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో కేంద్రానికి గట్టి షాక్ తగిలింది. ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారాలు ఉండాలని స్పష్టం చేసింది.
దిల్లీ సర్కారుకు అధికారాలు లేవన్న గత తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రభుత్వాధికారులపై స్థానిక ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ జనరల్ (ఎల్‌జీ) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని తెలిపింది.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, దిల్లీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది సింఘ్వీ వాదనలను విన్న తర్వాత జనవరి 18న తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఇవాళ ఆ అంశంపై సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది.