పెండింగ్‌లో 70 కొలీజియం సిఫార్సులు.. కేంద్రం జాప్యంపై సుప్రీంకోర్టు ఫైర్

-

కేంద్ర సర్కార్ తీరుపై సుప్రీం కోర్టు తీవ్రంగా ఫైర్ అయింది. న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన 70 సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉండడంపై విస్మయం వ్యక్తం చేసింది. వీటిని పరిష్కరించటానికి ప్రయత్నించాలని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని మంగళవారం ప్రస్తావించారు. తనకు వారం రోజుల వ్యవధి ఇవ్వాలని, ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతానంటూ అటార్నీ జనరల్‌ కోర్టుకు తెలిపారు. స్వల్ప సమయాన్ని కోరినందున తాము సంయమనం వహిస్తున్నామని, ఈసారి అలా ఉండబోమని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ తేల్చి చెప్పారు.

గత వారం వరకూ కొలీజియం చేసిన 80 సిఫార్సులు పెండింగ్‌లో ఉన్నాయని.. పది సిఫార్సులకు క్లియరెన్స్‌ ఇవ్వడంతో ఇంకా 70 మిగిలే ఉన్నాయని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ అన్నారు. వీటిలో 26 సిఫార్సులు జడ్జీల బదిలీలకు చెందినవని.. ఏడు ప్రభుత్వానికి మళ్లీ పంపిన సిఫార్సులు అని తెలిపారు. తొమ్మిదింటిని అసలు కొలీజియానికే తిప్పిపంపకుండా అలాగే ఉంచేశారని.. మరో కేసు సున్నితమైన హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిని నియమించడానికి సంబంధించినదని.. ఈ సిఫార్సులన్నీ గత ఏడాది నవంబరు నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి అ’ని అసహనం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news