‘మోదీ ఇంటి పేరు’పై వ్యాఖ్యలకు నమోదైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ రాహుల్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాది అయిన గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీతో పాటు గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనికి రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్ట్ 4వ తేదీకి వాయిదా వేసింది.
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఈ పరువునష్టం కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించింది. ట్రయల్ కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ.. లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.