హిందువులపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ తాతలు ప్రతి విషయంలో తాము హిందువుల కంటే భిన్నమైన వాళ్లమని భావించారని.. అదే ఇండియా, పాకిస్థాన్ ఏర్పాటుకు పునాది వేసిందని వ్యాఖ్యానిస్తూ విషం చిమ్మారు. ప్రవాస పాకిస్థానీయుల సమావేశంలో పాల్గొన్న మునీర్ ప్రసంగిస్తూ.. ఇతర దేశాల్లో ఉంటున్న పాకిస్థానీలు తమ ఉన్నతమైన భావజాలం, సంస్కృతిని మర్చిపోవద్దనీ సూచించారు. పిల్లలకు పాక్ చరిత్ర వివరిస్తూ ఉండాలని తెలిపారు.
ఇక కశ్మీర్‌పై మరోసారి నోరు పారేసుకుంటూ.. ఇస్లామాబాద్‌కు కశ్మీర్ “గొంతుకు వెళ్లే రక్తనాళం” వంటిదని అసీమ్ మునీర్ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌ను పాకిస్థాన్ ఎప్పటికీ మర్చిపోదని, కశ్మీరీలను ఒంటరిగా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. 13 లక్షల బలమైన భారత సైన్యమే తమను ఏమీ చేయలేదనీ, ఉగ్రవాదులు పాకిస్థాన్ ఆర్మీని ఏం చేయగలరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలతో ఆ దేశ సైనిక నాయకత్వానికి ఇండో పాక్ ఘర్షణలను పరిష్కరించే ఉద్దేశం లేదని స్పష్టమైందని విదేశాంగ నిపుణులు అంటున్నారు. ఆయన వ్యాఖ్యలకు భారత్ త్వరలోనే ఘాటు సమాధానం ఇవ్వనున్నట్లు సమాచారం.