పతంజలి ఆయుర్వేద కంపెనీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక అలోపతి వైద్యాన్ని, ఆ వైద్యులను కించపరిచేలా, నిరాధార ఆరోపణలు చేస్తూ పతంజలి కంపెనీ చేస్తున్న వాణిజ్య ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కంపెనీ ఉత్పత్తులు పలు వ్యాధులను నయం చేస్తాయని స్వయంగా ప్రకటించుకోవడం పైనా మండిపడింది. కరోనా వైరస్ నివారణకు వినియోగిస్తున్న ఆధునిక ఔషధాలు, టీకాలకు వ్యతిరేకంగా రాందేవ్ బాబా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
నిరాధారమైన, మోసపూరితమైన, సత్యదూరమైన ప్రకటనలను ఆపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ యాడ్స్ వెంటనే నిలిపివేయకపోతే.. ఆ కంపెనీ తయారు చేసే ఒక్కో ఉత్పత్తిపై రూ.కోటి చొప్పున జరిమానా విధించే విషయాన్ని పరిశీలించాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. మరోవైపు పతంజలి ఆయుర్వేద కంపెనీ అసత్య ప్రచారాన్ని అడ్డుకునే మార్గాన్ని కనుగొనాలని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయాధికారికి ధర్మాసనం సూచించింది.