2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా యూపీలో బీజేపీ ఒక సర్వే నిర్వహిస్తోంది. మహా జనసంపర్క్ అభియాన్ కింద రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతున్న కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధుల పనితీరుపై వస్తున్న స్పందన ఆధారంగా ఉత్తరప్రదేశ్ బీజేపీ పార్టీ లోక్‌సభ సభ్యుల నివేదిక కార్డును సిద్ధం చేస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 30న నెల రోజుల పాటు సీఎం యోగి అదిత్యనాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.బీజేపీ ఎంపీలందరికీ, ప్రముఖులు, వ్యాపారులు, యువ ఓటర్లు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, సోషల్ మీడియా వాలంటీర్లు తదితరుల నుంచి అందిన స్పందనపై సమాచారం కోరుతూ ప్రొఫార్మాను పంపినట్లు సర్వే వర్గాలు తెలిపాయి. ఎంపీ నియోజకవర్గాల్లో ఉన్న గ్రూపులుపై కూడా ఈ వర్గాలు అరా తీస్తున్నాయి. జూన్ 20 వరకు నిర్వహించిన కార్యక్రమాలపై అటువంటి మొదటి నివేదికను సమర్పించాలని అటు ఎంపీలను కూడా పార్టీ కోరింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే సమయంలో ఈ నివేదికలను పార్టీ పరిశీలిస్తుందని సమాచారం.
2019లో బీజేపీ ఓడిపోయిన యూపీలోని 14 స్థానాల్లో కూడా సమాచారాన్ని సేకరించేందుకు పార్టీ రాజ్యసభ ఎంపీలు,ముగ్గురు కేంద్ర మంత్రులు,ఇతర సీనియర్ నాయకులు బీజేపీ రంగంలోకి దింపింది.మహా జనసంపర్క్ అభియాన్ కింద లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 రకాల కార్యక్రమాలను బీజేపీ ప్లాన్ చేసింది, ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో కనీసం 10 వేల మందితో ర్యాలీలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇతర విషయాలతోపాటు, ర్యాలీకి హాజరైన వారి సంఖ్య, అలాగే ఎంపీలు కలిసిన ప్రముఖ కుటుంబాలు,వారి పేర్ల గురించి సమాచారం కోరింది, దానితో పాటు మోడీ సాధించిన విజయాల గురించి ఆయా సభల్లో ఎంపీలు చెప్పిన తీరు గురించి కూడా ఆరా తీస్తున్నారు.
మోడీ ప్రభుత్వ విజయాలను హైలైట్ చేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాలకు హాజరైన మీడియా ప్రతినిధుల సంఖ్యను మరియు విలేకరుల సమావేశాలపై మీడియా ప్రతినిధుల అభిప్రాయాన్ని కూడా పార్టీ కోరింది. లాభర్తి సమ్మేళన్ కు హాజరైన ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సంఖ్య మరియు ప్రభుత్వం గురించి వారి అభిప్రాయాన్ని కూడా నివేదికలో పేర్కొనవలసి ఉంటుంది. అదేవిధంగా, వ్యాపారులు ప్రభుత్వ కార్యక్రమాలు, స్థానిక ఎంపీల ప్రజాదరణ గురించి వ్యాపారి సమ్మేళన్ లో చెప్తున్న పాయింట్లను కూడా నివేదికలో పొందుపరుస్తున్నారు.
వికాస్ తీర్త్ కా అవలోకన్ పేరుతో లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రదేశాలలో ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించబడుతున్నాయి. వీటిని “తీర్థం” (తీర్థయాత్ర)గా అభివర్ణించడం ద్వారా నివేదికలు కోరబడ్డాయి. మోదీ, ఆదిత్యనాథ్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రదర్శించేందుకు ఓటర్లను, మీడియాను ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లాలని నేతలను పార్టీ కోరింది.ఈ కార్యక్రమాలకు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ నాయకులు కూడా హాజరుకానున్నారు.ఈ ప్రచారం ముగిసేలోగా, జూన్ 21 నుండి జూన్ 30 మధ్య జరిగే కార్యక్రమాల ఆధారంగా మరొక నివేదికను కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం.మొత్తానికి ఈసారి యూపీలో ఉన్న 80 ఎంపీ స్థానాలను గెలుచుకునే దిశగా బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోందన్న మాట.