సాధారణంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చాలా ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే మరిచిపోతాయి. కానీ ఎన్నో ఒడిదొడుకుల మధ్య ఎట్టకేలకు కొలువు దీరిన కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. తాజాగా వయో వృద్ధులకు గుడ్న్యూస్ చెప్పింది కర్ణాటక ప్రభుత్వం. ఇక నుంచి 65 ఏళ్లు పైబడినవారు దైవ దర్శనం కోసం దేవాలయాల్లో క్యూలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ మేరకు కర్ణాటక దేవాదాయ శాఖ బుధవారం సర్క్యులర్ జారీ చేసింది. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 358 ఆలయాలకు ఈ నియమం వర్తిస్తుందని పేర్కొంది.
‘ఇటీవల కాలంలో దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సీనియర్ సిటిజన్లు క్యూలో నిల్చొవడానికి ఇబ్బంది పడేవారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇక నుంచి నేరుగా దైవ దర్శనం చేసుకోవచ్చు. వయసు నిర్ధరణ కోసం ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డును తెచ్చుకోవాలి’ అని రాష్ట్ర దేవాదాయ కమిషనర్ తెలిపారు.