తాజ్ మహల్ భూమి షాజహాన్ ది కాదు అంటూ బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ నిర్మించిన భూమి వాస్తవానికి జైపూర్ పాలకుడు జై సింగ్ కు సంబంధించినది అని, దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ స్వాధీనం చేసుకున్నారని బిజెపి ఎంపీ బుధవారం పేర్కొన్నారు. పూర్వపు జైపూర్ రాజ కుటుంబానికి సంబంధించిన రికార్డులు తన దగ్గర అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అయితే నిజానిజాలు తెలుసుకునేందుకు తాజ్ మహల్ యొక్క 22 గదులు తలుపులు తెరవాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో వేసిన పిటిషన్ కు కూడా ఆమె మద్దతు పలికారు.
అయితే తాజ్ మహల్ చరిత్ర పై నిజనిర్ధారణకు గానూ విచారణ జరిపించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో బిజెపి అయోధ్య యూనిట్ మీడియా ఇన్ఛార్జి రాజనీశ్ సింగ్ శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు లక్నో బెంచ్ రిజిస్ట్రీ లో పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవం ఏదైనా సరే తెలుసుకోవడానికి “తాజ్ మహల్ కు చెందిన మూసివున్న ఇరవై రెండు గదుల తలుపులు తెరిపించాలి”. అని పిటిషన్లో కోరినట్లు పిటిషనర్ ఆదివారం ‘పిటిఐ’కి తెలిపారు. చారిత్రక స్మారకాలు, పురావస్తు ప్రాంతాలు వంటి వాటికి సంబంధించి 1951, 1958 చట్టాల్లొని కొన్ని నిబంధనలు కూడా పక్కన పెట్టాలని రజనీశ్ సింగ్ పిటిషన్ లో కోరారు. మొఘలులనాటి నాటి కట్టడమైన తాజ్ మహల్ ‘ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ సంరక్షణలో ఉంది.