ప్రపంచంలోనే అత్యంత బలమైన హోటల్ బ్రాండ్ హోదాను టాటా గ్రూప్‌నకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్)లోని ‘తాజ్’ తిరిగి దక్కించుకుంది. బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన ‘హోటల్స్ 50- 2024’ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. తాజ్ బ్రాండ్ విలువ 45% పెరిగి 545 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,500 కోట్ల)కు చేరినట్లు ఈ నివేదిక వెల్లడించింది. బ్రాండ్ స్ట్రెంత్ సూచీ (బీఎస్‌ఐ)లో 100 పాయింట్లకు గాను 92.9 పాయింట్ల స్కోరును తాజ్ సాధించడంతో ఏఏఏ ప్లస్ రేటింగ్‌తో ప్రపంచంలో బలమైన బ్రాండ్‌గా అవతరించింది.
ప్రపంచంలో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న రెండో బ్రాండుగా కూడా తాజ్ నిలవడం గమనార్హం. తాజ్ తన 120వ వసంతంలో.. మరోమారు ప్రపంచంలో అత్యంత బలమైన హోటల్ బ్రాండుగా నిలిచినందుకు సంతోషంగా ఉందని హెచ్‌సీల్ ఎండీ, సీఈఓ పునీత్ చాట్వాల్ తెలిపారు. నాలుగేళ్లకు గాను లభించే ఈ గుర్తింపును, మూడు సార్లు దక్కించుకోవడం 100 సంవత్సరాల చరిత్ర గల బ్రాండ్ ఘనతకు నిదర్శనమని అన్నారు.