ఈనెల 19వ తేదీన లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో సైనికులతో వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 9 మంది సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరణించిన తొమ్మిది మంది సైనికుల్లో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన జవాన్ చంద్రశేఖర్(30) ఉన్నారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
కొందుర్గు మండలంలోని తిర్మన్‌దేవునిపల్లికి చెందిన మల్లయ్య, శివమ్మ దంపతుల ముగ్గురు సంతానంలో చిన్నవాడైన చంద్రశేఖర్ కొందుర్గులోని బీసీ సంక్షేమ వసతిగృహంలో పదోతరగతి వరకు చదివారు. 2011లో చంద్రశేఖర్ భారత సైన్యంలో చేరారు. విధి నిర్వహణలో భాగంగా శనివారం లేహ్ జిల్లాలో తోటి సైనికులతో కలిసి ప్రయాణిస్తుండగా వాహనం లోయలో పడింది. ఈ దుర్ఘటనలో మరో ఎనిమిది సైనికులతో పాటు చంద్రశేఖర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మూడు నెలల క్రితం గ్రామానికి వచ్చిన చంద్రశేఖర్.. తన కుమారుడిని బడిలో చేర్పించేందుకు మళ్లీ వస్తానని చెప్పి వెళ్లారంటూ ఆయన భార్య లాస్య కన్నీటి పర్యంతమయ్యారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పార్థివదేహం ఇవాళ గ్రామానికి చేరుకోవచ్చని మాజీ సర్పంచి రామకృష్ణ తెలిపారు.