దడ పుట్టిస్తున్న ఎండలు

-

ఎండలు: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మామూలుగా లేవు. ప్రాణాలు తీసేస్తున్నాయి. ఇంత తీవ్రమైన వేడికి మనుషులు కూడా ఉడికిపోయేలా ఉన్నారు. బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరాయి. సాధారణంగా 40 డిగ్రీలంటేనే అల్లాడిపోతాం. ఇక 46 అంటే..ఇంకెంత ప్రమాదమో. పిల్లల్ని, ముసలివారు, దీర్ఘసమస్యలతో ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వారమంతా పరిస్థితి ఇలాగే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఒకవైపు ఎండ ఠారెత్తిస్తుంటే….మరోవైపు వడగాలులు గుబులుపుట్టిస్తున్నాయి. కానీ చాలా మంది ఎండైనా, వానైనా పట్టించుకోకుండా ఎవరిపనులు వాళ్లు చేసుకుంటూ పోతారు. అదే చాలా ప్రమాదం. ఈ మధ్యే ఓ కానిస్టేబుల్ కూడా వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎండల్లో కూలీలు, చిన్న వ్యాపారులు, కార్మికులు, వీధి వ్యాపారులు.. అందరూ ఇబ్బంది పడుతున్నారు. రాత్రివేళ కూడా వేడి గాలుల వల్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దాకా ఉంటున్నాయి. ఈ వేడి గాలులు పైకి ఉపశమనం కలిగిస్తున్నట్లు కనిపిస్తాయి. కానీ ఇవి చాలా డేంజర్. ఈ పరిస్థితుల్లో నీరు తప్పకుండా తాగుతూ ఉండాలి. ఇలాంటి సమయాల్లో మనం వేసుకునే దుస్తులు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. కాటన్ బట్టలకే ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం. అందులోనూ లైట్ కలర్ దుస్తులే వేసుకుంటే బెటర్.

అయితే మోఖా తుపాను వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు వాతావరణ నిపుణులు. పగటి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల దాకా పెరిగాయి. అందుకే హైదరాబాద్‌లో ఇప్పుడు ఒక్కసారిగా మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగి.. బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య తగ్గింది.

ఇంకో విషయమేంటంటే….ఈ నెల 25న రోహిణీ కార్తె మొదలవుతోంది. అప్పుడు ఎండలు మరింత పెరగడం ఖాయం. రోహిణీ కార్తె జూన్ 7 వరకూ ఉంటుందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జూన్ అంతా ఎండలు ఎక్కువగానే ఉంటాయి. ఇక అప్పుడు పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో. కాబట్టి ఎండలు కాస్త తగ్గేవరకు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ సమయంలో శీతలపానీయాలు తాగితే…మరిన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మజ్జిగ, నిమ్మరసం, ఇంట్లో చేసే పళ్ల రసాలు, గ్లూకోజ్ వాటర్ లాంటివి తీసుకోవడం చాలా ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Exit mobile version