టమాటా ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. మొన్నటి దాకా రూ.130 నుంచి రూ.150 దాకా ఉన్న ధర ఇప్పుడు ఏకంగా రూ.200 దాటేసింది. కొన్నిచోట్ల మూడు వందలకూ చేరింది. ఇక ఏపీలో టమాటా ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల రికార్డు ధర పలుకుతూ ఆపిల్‌కు తానేం దిగదుడుపు కాదని టమాట ధరలు నిరూపిస్తున్నాయి.
తాజాగా.. అనంతపురం టమాటా మార్కెట్ లో రైతులకు రికార్డు స్థాయి ధర పలికింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 15 కిలోల టమాటా పెట్టె ధర 3200 రూపాయలు పలికింది. అంటే.. సగటున 213 రూపాయలు పలికిన ధర.. రిటైల్ మార్కెట్లో 250 రూపాయలకు పైనే ఉండొచ్చని టోకు వ్యాపారులు చెబుతున్నారు. ఏటా వర్షాభావంతోనో, అకాల వర్షాలతో, మార్కెట్లో ధరలు పతనమై నష్టపోతున్న రైతులు ఈసారి రికార్డు స్థాయి ధరలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు వారి ఊహించిన ధరకంటే 40 శాతం వరకు అధికంగా వస్తుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.