మొత్తానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరడం ఫిక్స్ అయింది. చాలాకాలం నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్న జూపల్లికి ఇప్పుడు ముహూర్తం కుదిరింది. బిఆర్‌ఎస్ లోని పలువురు నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్ళి..ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు.
వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జూపల్లి కాంగ్రెస్ లోకి రావాలి. కానీ పొంగులేటి..రాహుల్ గాంధీని ఖమ్మంకు తీసుకొచ్చి భారీ సభ పెట్టి..ఆయన ఆధ్వర్యంలో తన అనుచర నేతలతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో కొల్లాపూర్‌కు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి భారీ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ లో చేరాలని జూపల్లి చూశారు. కానీ తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రియాంక టూర్ రద్దయింది. దీంతో జూపల్లి, ఇంకా పలువురు నేతలు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ లో చేరుతున్నారు. అధికారికంగా జూపల్లి కాంగ్రెస్ లో ఎంట్రీ అవ్వడం ఫిక్స్ అయింది.
అలాగే ఆయన కాంగ్రెస్ నుంచి కొల్లాపూర్ లో పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. వాస్తవానికి గతంలో జూపల్లి కాంగ్రెస్ లోనే పనిచేశారు. 1999లో ఇండిపెండెంట్ గా గెలిచిన ఆయన..2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. మంత్రిగా పనిచేశారు. తర్వాత బిఆర్‌ఎస్ లోకి వచ్చి 2012 ఉపఎన్నికలో గెలిచారు. 2014లో గెలిచారు.
కానీ 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలిచారు. తర్వాత ఆయన బిఆర్‌ఎస్ లోకి వచ్చారు. అక్కడ నుంచి జూపల్లి, బీరం మధ్య రచ్చ మొదలైంది. ఈ క్రమంలోనే నెక్స్ట్ జూపల్లికి బిఆర్‌ఎస్ సీటు లేదని తేలింది. దీంతో ఆయన బిఆర్‌ఎస్‌కు దూరమై..పొంగులేటితో పాటు కాంగ్రెస్ వైపు వచ్చారు. నెక్స్ట్ ఎన్నికల్లో జూపల్లి కాంగ్రెస్, బీరం బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తారు. అయితే ప్రస్తుత పరిణామాలు జూపల్లికే అనుకూలంగా ఉన్నాయి. మరి ఎన్నికల్లో జూపల్లి..బీరంకు చెక్ పెడతారేమో చూడాలి.