వినియోగదారులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా త్వరలో టమాటా ధరలు తగ్గవచ్చని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాలతో రవాణాకు ఇబ్బందులు ఎదురైతే తప్ప, రెండు వారాల్లోగా ధరలు తగ్గుతాయని తెలిపింది. హైబ్రిడ్ రకాలు పండించే దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి త్వరలోనే టమాటా ఉత్పత్తి పెరగనుందని వెల్లడించింది.
తద్వారా దేశ రాజధాని దిల్లీ సహా అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి రానుందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. జులై 12వ తేదీన కిలో టమాటా ధర దిల్లీలో రూ.75, ముంబయిలో రూ.83, కోల్‌కతాలో రూ.80గా ఉందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా కిలో సగటు ధర రూ.65.21 కాగా, గతేడాది ఇదే సీజన్‌లో రూ.53.36గా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దిల్లీకి హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి టమాటా సరఫరా అవుతోంది. త్వరలోనే ఆంధ్ర, కర్ణాటకల నుంచి ఉత్పత్తి పెరిగితే ఒకట్రెండు వారాల్లోనే ధరలు తగ్గవచ్చని, అందుకే మార్కెట్‌లో రాయితీపై అమ్మే యోచన లేదని అధికారులు వెల్లడించారు.