ఢిల్లీలో అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే. బిజెపి ప్రభుత్వం ఆమోదించిన ప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా పార్లమెంటులో మద్దతు కోరేందుకు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే సహా నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తో ఆయన సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యేందుకు రేపు అరవింద్ హైదరాబాద్ రానున్నారు. అధికారుల బదిలీపై పోరాటానికి ఆయన కెసిఆర్ మద్దతు కోసం హైదరాబాద్ కి రాబోతున్నారు. ఇందులో భాగంగానే రేపు ఆయన సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు.