ప్రధాని నరేంద్ర మోదీ జనవరిలో లక్షద్వీప్ దీవులను సందర్శించిన విషయం తెలిసిందే. దేశ ప్రజలంతా విహార యాత్రల కోసం విదేశాలకు వెళ్లే బదులు లక్షద్వీప్ వంటి దేశీయ పర్యాటక ప్రాంతాలు సందర్శించాలని, తద్వారా దేశీయ టూరిజాన్ని మరింత అభివృద్ధి పరిచే అవకాశం ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య కాస్త వివాదం నెలకొంది.
అయితే మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం అక్కడికి పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని లక్షద్వీప్ పర్యాటక శాఖ అధికారి ఇంతియాజ్ మహ్మద్ తెలిపారు. అంతర్జాతీయ, విదేశీ పర్యాటకులు ఈ ద్వీపాన్ని సందర్శించడానికి ప్యాకేజీల కోసం తమను సంప్రదిస్తున్నారని వెల్లడించారు. ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున శోధిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో లక్షద్వీప్ మరిన్ని క్రూజ్ షిప్ కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుందని, లక్షద్వీప్‌కు వాయు రవాణాను మెరుగుపరచడం వల్ల పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి మోదీ జనవరిలో కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌ను సందర్శించి ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్న విషయం తెలిసిందే.