భారత్లో పులులు రోజురోజుకు అంతరించిపోతున్నాయని ఓవైపు ప్రభుత్వాలు.. మరోవైపు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీలైనంత వరకు పులులను సంరక్షించుకునేందుకు తమ వంతు ప్రయత్నిస్తున్నారు. అయినా రోజు ఏదో చోట పులుల మృత్యువాత వార్తలు కలవరపెడుతూనే ఉన్నాయి. ఇటీవల కూనో పార్కులో నమీబియా చీతా మరణించిన వార్త మరవకముందే తాజాగా తాడోబా అభయారణ్యంలో రెండు పులులు మృత్యువాతపడ్డాయి.
మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా తడోబా అభయారణ్యంలోని ఝరి ఉపక్షేత్రంలో రెండు పులులు మరణించాయి. వాటి కళేబరాలను అటవీ సిబ్బంది సోమవారం సాయంత్రం గుర్తించారు. రెండురోజుల కిందట రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో అవి మృతిచెంది ఉంటాయని అటవీ అధికారులు, పశువైద్యాధికారి భావిస్తున్నారు. వాటి అవయవాలన్నీ సక్రమంగా ఉన్నాయని, శరీరాలపై తీవ్రగాయాలు ఉండటంతో ఘర్షణలోనే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. చనిపోయిన పులులు ఆరేళ్ల వయసున్న టి-142 అనే పేరు గల మగపులి, రెండేళ్ల ఆడపులి(టి-90)గా గుర్తించారు. ఈ నెలలో జిల్లాలో మొత్తం నాలుగు పులులు మృతి చెందడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది.