తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మంత్రి, డీఎంకే పార్టీ యూత్ వింగ్ సెక్రటరీ ఉదయనిధి స్టాలిన్ తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్టాలిన్ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఉదయనిధి తెలిపారు.
ఉపముఖ్యమంత్రి పదవిపై సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకోవాలని.. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తమ ప్రభుత్వంలోని అందరూ మంత్రులూ డిప్యూటీ సీఎంలే అని పేర్కొన్నారు. తాను నిర్వహిస్తున్న పార్టీ యువజన విభాగం కార్యదర్శి పదవి కూడా తన హృదయానికి దగ్గరగా ఉందన్న ఆయన.. తమ దృష్టంతా 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని వెల్లడించారు. మళ్లీ డీఎంకే కూటమే అధికారంలోకి వస్తుందని ఉదయనిధి ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల్లో గెలుపునకు పార్టీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా కృషి చేయాలని పిలుపునిచ్చారు.