సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఉదయనిధి వ్యాఖ్యలపై ఆ సమయంలో దేశంలో పెనుదుమారమే చెలరేగింది. ఇక ఇప్పుడు అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సమీపిస్తున్న వేళ ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెన్నైలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అయోధ్య రామమందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో మసీదు కూల్చి రామాలయం నిర్మించిన వ్యవహారంతో తాము ఏకీభవించలేమని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెప్పినట్లు డీఎంకేవారు ఏ మతానికి, విశ్వాసానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయోధ్యలో రాముడికి ఆలయం నిర్మించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ అక్కడి మసీదు కూల్చివేసి ఆలయం నిర్మించిన వ్యవహారంతో ఏకీభవించలేమని చెప్పారు. మరో మూడ్రోజుల్లో అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరగనున్న నేపథ్యంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి సంచలనం రేకెత్తించాయి.