ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు ఉత్తరాఖండ్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. అందుకు సంబంధించిన బిల్లును ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లుకు సంబంధించిన ముసాయిదా ప్రతిని ఉత్తరాఖండ్ కేబినెట్ ఆదివారం ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే స్వాతంత్య్రం తర్వాత ఉమ్మడి పౌర స్మృతి చట్టాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది.
ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్నట్లు 2022 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. రెండోసారి అధికారం చేపట్టిన సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయగా రెండేళ్ల పాటు కసరత్తు చేసిన ఈ కమిటీ గత శుక్రవారం ముసాయిదా ప్రతిని సమర్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బిల్లును ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదించగా ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టింది పుష్కర్ సింగ్ ప్రభుత్వం. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే ఉత్తరాఖండ్‌లోని అన్ని మతాలకు ఒకే తరహా వివాహ, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి.