డీప్​ఫేక్ కట్టడికి త్వరలో కొత్త నిబంధనలు.. ఆ వీడియోల క్రియేటర్స్​కు జైలుశిక్ష

-

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న డీప్ ఫేక్ టెక్నాలజీతో ఏర్పడే ముప్పును అరికట్టేందుకు చర్యలకు ఉపక్రమించాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ప్రజాస్వామ్యానికి సరికొత్త ముప్పుగా డీప్‌ఫేక్‌ టెక్నాలజీ మారుతోందని ఆయన అన్నారు. దీని నుంచి ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి త్వరలో కొత్త చట్టాలను తీసుకొచ్చే యోచనలో కేంద్ర సర్కార్ ఉందని చెప్పారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికల్లో దుమారం రేపుతున్న డీప్‌ఫేక్‌ సమస్యపై సోషల్‌ మీడియా వేదికల ప్రతినిధులతో సమావేశమైన అశ్వినీ వైష్ణవ్.. డీప్‌ఫేక్‌పై ముసాయిదాను తయార చేయబోతున్నామని తెలిపారు.  డీప్‌ఫేక్‌ సమస్యను గుర్తించడం, నిరోధించడం, రిపోర్టు చేయడం వంటి అంశాలపై ప్రజలకు సరైన అవగాహన కలిగించేందుకు సోషల్‌ మీడియా సంస్థలు అంగీకరించినట్లు చెప్పారు. డిజిటల్‌ ప్రపంచానికి ఈ భౌతిక ప్రపంచంలో ఎటువంటి పరిధులు లేవని.. ఇలాంటి ముప్పు భారత్​కు రాకుండా అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు.

“ప్రభుత్వం ప్రస్తుతం ప్రధానంగా నాలుగు పిల్లర్లపై దృష్టి కేంద్రీకరించనుంది. మొదటిది గుర్తించడం, రెండోది డీప్‌ఫేక్‌ వినియోగాన్ని నిరోధించడం, మూడవది రిపోర్టింగ్‌ చేసే విధానాన్ని అభివృద్ధి పరచడం, ప్రస్తుతం దీనిమీద పనిచేస్తున్నాము. నాలుగవది ఎలా గుర్తించాలి?,  ఎలా కనుక్కోవాలి?, ఎలా రిపోర్ట్‌ చేయాలి ?, అన్న విషయాలపై ప్రజలకు అవగాహన కలిగించడం వంటివి. వీటిమీద మేము పని చేస్తున్నాము.” అని కేంద్ర మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version