కార్గిల్ విజయ్ దివస్’ 21వ వార్షికోత్సవం సందర్భంగా.. సైనికుల త్యాగాలపై ప్రశంసలు కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సైనికుల శౌర్యాన్ని స్మరించిన షా.. నేడు దేశం గర్వించదగ్గ రోజు అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.1999 జులై 26న భారత సైనిక బలగాలు పాకిస్థాన్‌ను మట్టికరిపించాయని పేర్కొన్నారు షా. కార్గిల్ విజయ్ దివస్.. దేశం గర్వించదగ్గ రోజు. సైనికుల వీరత్వం, వెన్నుచూపని నాయకత్వానికి ప్రతీక.
వారి మొక్కవోని ధైర్యంతో.. కార్గిల్‌లో శత్రువులను తరిమికొట్టి, అక్కడ మన త్రివర్ణపతాకాన్ని రెపరెపలాడించారు. వారు దేశాన్ని కాపాడేందుకు అంకితభావంతో పనిచేస్తున్న నిజమైన హీరోలు అని అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా.. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసి దేశాన్ని రక్షిస్తోన్న వీర సైనికులకు ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అమర జవాన్లకు నివాళులని పేర్కొన్నారు.