డీప్‌ఫేక్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర సర్కార్.. కట్టడి చర్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా త్వరలో సోషల్ మీడియా సంస్థలతో సమావేశం జరపనుంది. అయితే కృత్రిమ మేధ, డీప్‌ఫేక్ వంటి సాంకేతికతతో సృష్టించే నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. అవసరమైతే ఇందుకోసం కొత్త చట్టం తీసుకొస్తామని ప్రకటించారు.
ఏఐతో అభివృద్ధి సాధ్యమే అయినా.. దీని దుర్వినియోగంతో కలిగే నష్టాలు తీవ్ర పరిణామాలు సృష్టిస్తాయన్న విషయం మర్చిపోవద్దని రాజీవ్ అన్నారు. ఈ టెక్నాలజీతో నకిలీ, విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేసి సమాజంలో కొంత మంది విద్రోహ శక్తులు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. భవిష్యత్‌లో ఇది మరింత తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ సమాచారం ప్రజా భద్రతకు ప్రమాదకరంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. అందుకే వీటిని ఆదిలోనే కట్డడి చేసేందుకు కేంద్రం ఐటీ నిబంధనలు తీసుకువచ్చిందని తెలిపారు. వీటిని వ్యాప్తిని అడ్డుకునేందుకు కొత్తగా ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తున్నామని వెల్లడించారు.