దేశంలో కోవిడ్ టీకాల కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అనేక చోట్ల మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు ఇచ్చేందుకే టీకాలు లేవు. దీంతో కేంద్రాల వద్ద జనాలు టీకాల కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ఆరోగ్యసేతు యాప్‌ను రాహుల్ అన్‌క్వాలిఫైడ్ సేతుగా, కోవిన్ యాప్‌ను నోవిన్ యాప్‌గా అభివర్ణించారు. అన్‌క్వాలిఫైడ్ సేతు, నోవిన్ యాప్‌లు ప్రజలను రక్షించలేవని, 2 డోసుల వ్యాక్సిన్ మాత్రమే ప్రజలను రక్షిస్తుందని రాహుల్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇక మరోవైపు కాంగ్రెస్ వర్క్ కమిటీ కూడా ప్రధాని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది.
కరోనా సెకండ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరించినా దేశంలో కోవిడ్ తగ్గిందని, కోవిడ్ పై విజయం సాధించామని కేంద్రం ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. దేశంలో ఎక్కడ చూసినా వ్యాక్సిన్లు, మందులు, వైద్య సదుపాయాలకు తీవ్రమైన కొరత ఏర్పడిందని పేర్కొంది. కరోనా కట్టడికి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సూచనలు చేస్తే వాటిని పరిశీలిస్తామని చెప్పాల్సింది పోయి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్మోహన్ సింగ్‌ను కించ పరుస్తూ సమాధానం ఇవ్వడం బాధాకరమని తెలిపింది. ఇప్పటికైనా మేల్కొని వాస్తవ పరిస్థితులు గమనించాలని, లేదంటే సంక్షోభం ఇంకా ముదురుతుందని సీడబ్ల్యూసీ ఒక ప్రకటనలో తెలిపింది.