గుజరాత్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రోజున కురిసిన వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. గంటలకొద్ది కురిసిన వడగండ్లతో రాష్ట్ర రైతులు పంట నష్టపోయారు. మరోవైపు పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 20 మంది మృతి చెందారు. గుజరాత్‌లోని మొత్తం 252 తాలూకాల్లో 234 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయని ఈ విషయాన్ని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారులు వెల్లడించారు.
దాహోద్ జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, తాపిలో ఇద్దరు, అహ్మదాబాద్, అమ్రేలీ, సూరత్, సురేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో పిడుగులు పడి మరో 11 మంది మరణించారు. అకాల వర్షాలతో పలువురు మృతిచెందడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మరోవైపు సూరత్, సురేంద్రనగర్, ఖేడా, తాపి, భరూచ్‌లో 16 గంటల్లో రికార్డు స్థాయిలో 50-117 మి.మీ వర్ష పాతం నమోదైనట్లు రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాజ్‌కోట్, మోర్బీ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగండ్లు కురిసినట్లు చెప్పారు.