అలాంటి వారికి హారతి ఇవ్వాలా.. బుల్డోజర్‌ ఆపరేషన్‌పై సీఎం యోగి సంచలన కామెంట్స్

ఉత్తర్‌ప్రదేశ్‌లో బుల్డోజర్లతో నేరస్థుల ఇళ్ల కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బుల్డోజర్ ఆపరేషన్ పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. అలాంటి నేరస్థులకు హారతి ఇవ్వాలా అంటూ విరుచుకుపడ్డారు. తన ప్రభుత్వం చేపడుతున్న బుల్డోజర్ ఆపరేషన్ ను సమర్థించారు. ప్రభుత్వం బుల్డోజర్లతో నేరస్థుల ఇళ్లను ఎందుకు కూల్చివేస్తోందని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందిస్తూ.. అక్రమంగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన వారికి హారతి ఇవ్వాలా? అంటూ ప్రశ్నించారు.

ఇలాంటి నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. నేరస్థులు, మాఫియాపై తమ ప్రభుత్వం చేస్తున్న ఈ ఆపరేషన్‌ సరైనది. రాష్ట్ర అభివృద్ధికి ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదు. తక్షణమే చర్యలు తీసుకుంటాం. కొందరు అక్రమార్కులు ప్రభుత్వ ఆస్తులను ఇష్టారీతిగా ఆక్రమించుకున్నారు. గత ప్రభుత్వాలు వారిపై చర్యలు తీసుకునేందుకు సాహసించలేదు. అని యోగి స్పష్టం చేశారు. మరోవైపు మైనారిటీ వర్గానికి చెందిన నేరస్థులనే లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టారని వచ్చిన ఆరోపణలను ఆయన తోచిపుచ్చారు.