కేరళ విషాదంలో 287కు చేరిన మృతులు.. వయనాడ్ కు ప్రముఖుల ఆర్థిక సాయం

-

కేరళ వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 287  మంది మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 78 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు 116 మంది మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. ఇంకా 240  మంది ఆచూకీ దొరకడం లేదు. చనిపోయిన వారిలో 22 మంది పిల్లలున్నారు.

ప్రస్తుతం మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించే పని సాగుతోంది. సహాయక చర్యల్లో డిఫెన్స్‌ సెక్యూరిటీ కోర్‌కు చెందిన నాలుగు బృందాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందినవారు పాల్గొంటున్నారు. తాత్కాలిక వంతెనలను నిర్మించి బాధితులను వారు తరలిస్తున్నారు. హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు.

మరోవైపు వయనాడ్‌ ఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు అదానీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఐదు కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించారు. RPగ్రూప్‌ ఛైర్మన్‌ రవి పిళ్లై, లూలు గ్రూప్ ఛైర్మన్‌ MA యూసఫ్‌ అలీ, కల్యాణ్‌ జువెలర్స్‌ ఛైర్మన్‌ TS కల్యాణ రామన్‌ కూడా ఒక్కొక్కరూ ఐదు కోట్ల రూపాయలను కేరళ సీఎం సహాయనిధికి అందించారు. తమిళ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 20లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news