ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపుతామని అన్నారు కేంద్రమంత్రి అమిత్ షా. సోమవారం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కీశ్త్ వార్ లో నిర్వహించిన సభలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని మరోసారి కనిపించినంత స్థాయిలో పాతి పెడతామని పేర్కొన్నారు. ప్రధాని మోడీ పాలనలో ఉగ్రవాద పునరుద్ధరణకు ఎవరు సహసించలేరన్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 చరిత్రలో కలిసిపోయిందని, అది తిరిగి రాదని స్పష్టం చేశారు అమిత్ షా. ఉగ్రవాదుల విడుదల గురించి నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ ల మేనిఫెస్టో పేర్కొంటుందన్నారు.
అలాగే జమ్మూ కాశ్మీర్ లో రెండు రాజ్యాంగాలకు , రెండు జండాలకు, ఇద్దరు ప్రధానులకు చోటు లేదని.. కాశ్మీర్ లో ఎగిరేది కేవలం మూడు రంగుల జెండా మాత్రమేనని వ్యాఖ్యానించారు. జమ్మూలో తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 నీ పునరుద్ధరిస్తామని ఎన్సి, కాంగ్రెస్ పార్టీలు అంటున్నాయి.. ఒకవేళ అదే జరిగితే రాష్ట్రంలో పహడి, గుజ్జర్ల రిజర్వేషన్లు రద్దవుతాయని చెప్పుకొచ్చారు.