భారత్‌లో తయారైన ఓ దగ్గు మందు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేసింది. జలుబు, దగ్గు నివారణ కోసం ‘కోల్డ్ అవుట్’ పేరుతో రూపొందించిన సిరప్ వినియోగించడం సురక్షితం కాదని సూచించింది. ఇందులో పరిమితికి మించి డై ఇథలీన్, ఇథలీన్ గ్లైకాల్‌లు ఉన్నట్లు తెలిపింది. చిన్నపిల్లలు ఈ సిరప్‌ను ఉపయోగిస్తే తీవ్ర అస్వస్థతకు గురై మరణం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.
చెన్నైకి చెందిన ఫోర్టిస్ లేబరేటరీస్ ఇరాక్‌లోని డాబిలైఫ్ ఫార్మా కోసం ఈ మందును తయారు చేసింది. కోల్డ్ అవుట్‌లో డైఇథలీన్, ఇథలీన్ గ్లైకాల్ వినియోగానికి 0.10% పరిమితి ఉంటే.. కోల్డ్ అవుట్‌లో 0.25% డైఇథలీన్, 2.1% ఇథలీన్ గ్లైకాల్‌లు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ సిరప్ భద్రత, నాణ్యత గురించి తాము అడిగిన వివరాలనూ కంపెనీ సమర్పించలేదని ఆరోపించింది. ఇటీవల భారత్‌లో తయారైన సిరప్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరికలు జారీ చేయడం ఇదే ప్రథమం.