దేశంలో సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఏం ఓటేస్తాంలే అని ఇంటి వద్దే ఉంటున్నారు. గంటల తరబడి క్యూలో ఏం నిలుచుకుంటాం అని ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 వరకు కొనసాగుతుంది. ఉదయం 7-9 మధ్య పెద్దగా క్యూలుండవు. ధ్రువపత్రాలు సరిగ్గా ఉంటే, 10-15 నిమిషాల్లో ఓటేసి బయటకు వచ్చేయొచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
గతంలో సాయంత్రం 5 వరకే పోలింగ్ కొనసాగేది. ఎండల దృష్ట్యా ఎన్నికల కమిషన్ దానిని సాయంత్రం 6 వరకు పెంచింది. సాయంత్రం 6 లోపు లైనులో ఉంటే అందరూ ఓటేసే వరకు అవకాశం ఇస్తారు. కుటుంబ సభ్యులంతా ఒకేసారి వెళ్తే అందరూ ఒకేసారి ఓటేసి రావచ్చు. సెల్‌ఫోన్ లోపలికి అనుమతించరు కాబట్టి, మీవారికి దాన్ని ఇచ్చి పోలింగ్ బూత్‌లోకి వెళ్లవచ్చు. ఉదయం 11 తర్వాత వెళ్లే పెద్దలు ఎండన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది ఉదయం 5, 6 గంటలకే వాకింగ్‌కు వెళుతుంటారు. పనిలో పనిగా ఓటర్ ఐడీ తీసుకెళ్తే అటు నుంచి అటే వెళ్లి ఓటేసి రావచ్చు.