ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా వైద్య-ఆరోగ్య శాఖ చెప్పే సమాచారానికి విరుద్ధంగా ఉన్న, వైద్యపరంగా తప్పుదోవ పట్టించేలా ఉన్న వీడియోలను తొలగించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ‘వెల్లుల్లితో క్యాన్సర్ నయం’, ‘రేడియేషన్ చికిత్సకు బదులు విటమిన్-సి తీసుకోండి’ వంటి సూచనలు చేసే వీడియోలను తొలగిస్తామని వెల్లడించింది. ఆరోగ్య సమస్యలు, చికిత్సలు, ఔషధాలకు సంబంధించి అసత్య సమాచారంపై తమ విధానాలను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది.
తప్పుదోవ పట్టించే విషయాల్లో దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేయడం మీద దృష్టి సారించామని.. వైద్యపరమైన అంశాల్లో నిర్మూలన, చికిత్స, నిరాకరణకు సంబంధించి ఇప్పటివరకు తమ వద్ద ఉన్న డజన్ల కొద్దీ విధానాలను క్రమబద్ధీకరిస్తున్నామని యూట్యూబ్ తన బ్లాగ్‌లో పేర్కొంది. క్యాన్సర్ బారినపడిన వ్యక్తి లేదా వారి కుటుంబ సభ్యులు.. వ్యాధి లక్షణాలు, చికిత్స వంటి అంశాలను తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో పరిశోధిస్తారని.. వారికి అత్యంత నాణ్యమైన కంటెంటును అందించడమే తమ లక్ష్యం అని తెలిపింది.