కర్ణాటక కేబినెట్ కొలువుదీరింది. శనివారం రోజున మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. తాజాగా మంత్రులకు శాఖలను కేటాయించింది సిద్ధరామయ్య ప్రభుత్వం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల వద్ద కీలక శాఖలు ఉన్నాయి. సీఎం సిద్ధరామయ్య ఆర్థిక శాఖ (Finance Ministry) బాధ్యతలు నిర్వహించి 13 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆర్థికశాఖను తానే తీసుకున్నారు. కేబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, సమాచార, ఐటీ, మౌలికసదుపాయాల అభివృద్ధి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫామ్స్ వంటి శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖ, బెంగళూరు నగర అభివృద్ధి శాఖలను కేటాయించారు.
ఈ నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయణ్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. డీకేను షర్మిల కలుసుకోవడం అటు కర్ణాటకతో పాటు ఇటు తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమవుతోంది.