ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం.. అని రాజకీయ పార్టీల నాయకులు సహజంగానే హామీలు ఇస్తుంటారు. కానీ కొద్ది మంది మాత్రమే తమ వాగ్దానాలను నిలబెట్టుకుంటుంటారు. చాలా మంది ఎన్నికల్లో గెలిచాక ప్రజల ముఖాలు చూడరు. తమ నియోజకవర్గాల్లో కాలు కూడా పెట్టరు. దీంతో ప్రజలు విసుగు చెంది తమ ప్రజా ప్రతినిధి కనిపించడం లేదంటూ ఫిర్యాదు కూడా చేస్తుంటారు. కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు విషయంలోనూ ఇలాగే జరిగింది.
నవజోత్ సింగ్ సిద్ధు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోని అమృతసర్ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక్కసారి కూడా తన నియోజకవర్గంలో పర్యటించలేదు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ఆ నియోజకవర్గం ప్రజలు ఊరూరా పోస్టర్లు అంటించారు. నవజోత్ సింగ్ సిద్ధు కనిపిస్తే ఆచూకీ తెలపాలని, రూ.50వేల రివార్డును అందజేస్తామన్నారు.
కాగా 2017లో సిద్ధు అమృతసర్ ఈస్ట్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాకేష్ కుమార్‌పై 42వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019లో అమరీందర్ సింగ్ కేబినెట్ నుంచి ఆయన తప్పుకున్నారు. పలు వివాదాలు చోటు చేసుకోవడంతో సిద్ధు మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు. ఇక 2019 జూలైలోనూ సరిగ్గా ఇలాంటి పోస్టర్లే సిద్ధు నియోజకవర్గంలో వెలిశాయి. అప్పట్లో రూ.2100 రివార్డును ఇస్తామని ప్రకటించారు.