దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు..తాజాగా బిహార్‌లోని పట్నా ఎయిమ్స్‌లో చదువుతున్న నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు.అరెస్టయిన వారిలో ముగ్గురు (చందన్ సింగ్, కుమార్ షా,రాహుల్ అనంత్‌ను) ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతుండగా.. మరొకరు (కరన్ జైన్) మొదటి సంవత్సరం చదువుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నలుగురు విద్యార్థుల్ని విచారించాల్సి ఉందని ..ఎయిమ్స్ సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుల సమక్షంలో హాస్టల్ గదుల నుంచి తీసుకెళ్లారు. అనంతరం వారి హాస్టల్ గదుల్ని సీల్ చేశారు. వీరిని డీన్, హాస్టల్ వార్డెన్, డైరెక్టర్ ఓఎస్‌డీ సమక్షంలో సీబీఐ అదుపులోకి తీసుకున్నట్లు ఎయిమ్స్ పట్నా డైరెక్టర్ జీకే పాల్ పేర్కొన్నారు. కాగా, నీట్ పరీక్ష జరగడానికి ముందు ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఎన్టీఏ కి చెందిన ట్రంక్ పెట్టె నుంచి నీట్ పేపర్‌ను తస్కరించాడన్న కేసులో 2017 బ్యాచ్ ఎన్‌ఐటీ జంషెడ్‌పుర్ సివిల్ ఇంజినీర్ పంకజ్ కుమార్ అలియాజ్ ఆదిత్యను అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత వీరిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం.