నెల్లూరు జిల్లా లో నదులు ఉగ్రరూపం దాల్చాయి. జల ప్రళయం సమీప గ్రామాలను ముంచెత్తుతోంది. నెల్లూరు జిల్లాలో పెన్ననది ఉప్పొంగి ప్రవహస్తోంది. భయం గుప్పిట్లో నది సమీప గ్రామాలయిన వెంగమ నాయుడుపల్లి, బండారుపల్లి, వీర్లగుడిపాడు, నడిగడ్డ అగ్రహారంలను పెన్నా వరద ప్రవాహం చుట్టు ముట్టింది. అంతకంతకు ఉపనదులు కొమ్మ లేరు, కేతా మన్నేరు, బొగ్గేరు, బీరాపేరు, నల్లవాగు పొంగి పొర్లతున్నాయి. ఇప్పటికే సోమశిల జలాశయం నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. దిగువ నదుల నుంచి మరో రెండు లక్షల క్యూసెక్కుల వరదనీరు పెన్నా నదిలో కలుస్తోంది.
పెన్నా నది లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు ఆనకట్ట వద్ద దాదాపు 5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదు అవుతోంది. నెల్లూరు నగరం లోతట్టులో ప్రజలు భయం.. భయంగా ఉంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుతుంది. కాళంగి ప్రవాహంతో మరోసారి సూళ్లూరుపేట కు వరద ముప్పు పొంచి ఉంది. ఇక జిల్లా లో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదుల ఉధృతితో నదీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నదుల తీర ప్రాంతాల్లో భారీగా భద్రతా పోలీసుల మోహరించారు.